Pages

Subscribe:

Tuesday, July 22, 2008

చందమామ రావే, జాబిల్లి రావే.. ‘ అనో, ‘లాలి లాలి.. ‘ అనో, ‘జో అచ్యుతానంద.. ‘ అనో … తెనుగింట అమ్మ పాడకపోతే, హన్నన్నా! ఇంకేవైనా ఉందా? కొంపలంటించేయరూ కోతిరాయుళ్ళు.. అదే, పిల్ల పిడుగులు! మనం ఇప్పుడు చెప్పుకోబోయే ‘అన్నమయ్య’ గారు వాళ్ళ మీద జోలలూపడానికి సంధించిన అస్త్రాలే అవన్నీ. ఇలాటివి అన్నీ ఇన్నీ గాక.. ఏకంగా ముప్పైరెండు వేలు పైచిలుకు సంకీర్తనల్ని కూర్చారు.. రాయొద్దూ? ఈ కోతిరాయుళ్ళకే ఇంత బెట్టయితే, ఈ కోతులందరి ముఠానాయకుడైన కోతులరాయుడ్నే కాచే కొండలరాయుడి మెప్పు కోసం, తప్పదు మరి!

‘సరే బాబాయ్ , సినిమా చూసాం కదా, మళ్ళీ ఏంటి?’ అన్న ప్రశ్న ఒకదానికి నేను సమాధానం చెప్పుకోవాల్సి ఉంది కదా? ఏంటంటే, సినిమాలో అన్నీ చెప్పడం కుదరదుగా, జనాల నాడి బట్టి, రక్తి గట్టే సన్నివేశాలు చూపించారు. ఏదో నాకు తెలిసిన సినిమాలో లేని నాలుగు ముక్కలు చెబుదామని మొదలెట్టా.

కాని నేను చెబుదామనుకునే లోపే నాకంటే ఉత్సాహవంతులు కొంతమంది చాలా విషయాలు పొందుపరిచారు. ఇక్కడ (రమ్య గార్కి కృతజ్ఞతలు) అన్నమయ్య గారి నివాస స్థల విశేషాలు, వారికి ఇటీవల 600వ జయంతి సందర్భంగా కట్టించిని 108 అడుగుల విగ్రహాన్ని చూడవచ్చు. అన్నమయ్య వంశంలో ఆయనేకాదు, మొత్తం అందరూ కళాకారులే. వారి తాతగారి గురించి చిన్న కధ ప్రచారంలో ఉంది (మూలం). అదేంటంటే, అన్నమయ్య తాత నారాయణయ్యకి (మూలంలో నారయణసూరి అనుంది, అది తప్పు(దీనికి మూలం)) చదువబ్బేది కాదట.చెవులు నులిపెట్టినా, కోదండం వేయించినా, గుంజిళ్ళు తీయించినా ఓనమాలు కూడా అబ్బకపోతే, ఆ బాధతో, ఆ వూరి చింతలమ్మ గుడిలో ఉన్న పాము పుట్టలో చెయ్యిపెట్టి చావడానికి సిద్దపడ్డాడట, అప్పుడు ఆ చింతలమ్మే ఒక ముసలిదాని రూపంలో వచ్చి, మీ వూరి కేశవస్వామిని(గుడి చిత్రాన్ని ఇక్కడ చూడొచ్చు) నీకు చదువు ప్రసాదించమని అడుగు - ఇస్తాడు అని చెప్పి పంపించిదట. అప్పుడా నారాయణయ్య “సరస్వతికి మామగారివి నువ్వు, నాకింత విద్యా దానం చెయ్యి” అని వేడుకొన్నాట్ట. ఆ స్వామి అనుగ్రహంతో మాహా విద్వాంసుడయ్యాడు, ఆ స్వామి ఒక్క నారాయణయ్యని మాత్రమే కాకుండా, అతని సంతతినంతటినీ కరుణించినట్టున్నాడు. తాళ్ళపాక కుటుంబంలోని వారంతా - వాగ్గేయకారులూ, సాహితీవేత్తలూ, సంగీత కళాకారులూ, కవులూ, విద్వాంసులూ, పండితులూను. స్వయానా అన్నమయ్య భార్య తిమ్మక్కే “సుభద్రాకల్యాణ”మనే ద్విపద కావ్యాన్ని రచించింది కూడా.

ఆ.. ఇంకో ముక్కేంటంటే, మొన్న “కట్టుబాట్లు” పేరుతో ఒక టపా రాయడం జరిగింది. అందులో ‘దేవాలయం పై బూతుబొమ్మలు’ అనే విషయం మీద చర్చ జరిగింది. బహుశా, అన్నమయ్య రచనల వెనకున్న ‘భగవదారధనా భావం’, ఆ శిల్పాల వెనకున్న కారణం ఒక్కటేనని, నాకు అనిపిస్తుంది, అలాగే ఇది వరకే చాలా మందికి తోచింది (మూలం హైదరాబాద్ విశ్వవిద్యాలయం). ఈ మూలంలో ఏముందంటే, ” అన్నమయ్య విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అనుసరించినవాడు. ఆ సిద్ధాంతం ద్వైధీభూతమెలాగో ఆయన కవిత్వమూ ద్విధావిభజితం. భగవత్కీర్తనకై పరమ ఆధ్యాత్మిక సంకీర్తనలు ఎలా రచించాడో, వెంకటేశ్వరుడు ఆయన ఇరువురు భార్యలు - అలమేలు మంగ , పద్మావతుల శృంగారాన్ని రసరమ్యంగా కీర్తించాడు. భక్తుడైన వ్యక్తి ఆ శృంగార సంకీర్తనలను నాయక, నాయికలు అలౌకికులని భావిస్తే అవి భగవదారాధనలో భాగమవుతాయి. ఆ శృంగార సంకీర్తనలు భగవంతునికి సంబంధించినవని భక్తుడు నిరంతరం భావిస్తూ ఉండాలి. భక్తుడు/ శ్రోత/ పాఠకుడు ఆ పాత్రల్లో తాదాత్మ్యమవడానికి వీలు లేదు. అప్పుడవి పరమలౌకిక శృంగార గీతాలయ్యే ప్రమాదముంది. అన్నమాచార్యుడిని తన ఆస్థానానికి ఆహ్వానించి వేంకటేశ్వరుడి పై పాట పాడుమన్న సాళువ నరసింహరాయుడు ‘ఏమొకో చిగురుట ధరమున’ అనే రమ్యమైన గీతాన్ని విని, తనపైగూడా అటువంటి కీర్తనే పాడుమని అనడం, నరసింహరాయుడు ఆ పాత్రలో తాదాత్మ్యమవడం వల్లే జరిగింది. ‘నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ నోపదు జిహ్వ’ అని అన్నమయ్య సున్నితంగా తిరస్కరించాడు.” ఇహ నేను చెప్పేదేంటంటే, ఇంతకు మించి నేను గాని, ఇంకెవరైగాని చెప్పడం కష్టం. అదీ మీరు, “చదివినవన్నీ చేయనలవి కావు” అని మొండిగా, మూర్ఖంగా వ్యవహరిస్తే అంతకంటే అసాధ్యం లేదు.

0 Comments:

Post a Comment