Monday, July 21, 2008
త్యాగయ్య ఆనంద భైరవి - రుద్రవీణ బిలహరి
ఆ టైటిల్ చూసి నేనేదో రాసేస్తున్నా అని ఊహించకండి. నాకేం సంబంధం లేదు మీ అంచనాలతో. నేను పొద్దున్నే లేచి ఏమీ తోచక - “త్యాగరాజు భక్త సుధార్ణవము-నామజప రూపక కృతులు” అన్న మరువూరు కోదండరామిరెడ్డి గారి సంకలనాన్ని తెరిచాను. పుస్తకం మొదటి కొన్ని పేజీలూ త్యాగయ్య చరిత్ర ఉంటేనూ… కాసేపు చదివాను. అక్కడ చదివిన ఓ ఆసక్తి కరమైన సంఘటననూ, ఆ సంఘటన నాకు గుర్తు తెచ్చిన ఓ సినిమా సీనునూ ఇక్కడ పంచుకోడం ఈ టపా ఉద్దేశ్యం…అంతే…మరింకేం ఖాదు. టైటిల్ చూసి కొందరు విషయమేమిటో కూడ కనిపెట్టేసి ఉండొచ్చు.
ఇంతకీ… 203 రాగాలు పాడారట త్యాగయ్య…అందులో ఆనంద భైరవి మాత్రం లేదట. ఎందుకో? అంటే… ఇదీ కథ… త్రిభువనం స్వామినాథ అయ్యరు అని కుంభకోణం లో పెద్ద విద్వాంసుడు ఉండేవాడట. ఆనందభైరవి రాగం ఆలపించడం లో ఆయన్ని మించిన వాడు లేడు అని పేరు పొందాడట. ఓసారి అతని జట్టు తిరువయ్యూరు వచ్చిందట. త్యాగయ్య అతని ప్రఖ్యాతి విని అతని ప్రదర్శన కి వచ్చాడట. అప్పుడు అతను ఆనందభైరవిలో “మధురానగరిలో…” అన్న పాట పాడగా విని పరవశుడై అందరిముందూ స్వామినాథయ్యర్ భుజం తట్టి కౌగిలించుకున్నాడట. ఇది చూసి సంతోషించాల్సిన విషయమే అయినా, అప్పుడు అతను త్యాగయ్య ని - ఇకపై ఆనందభైరవి పాడవద్దనీ, తన పేరు నిలుపమనీ అర్థించాడట!!! ఈ కారణంగా త్యాగయ్య ఎప్పుడూ ఆనందభైరవి లో పాడలేదట!
ఇదంతా చదువుతూ ఉంటే నాకు రుద్రవీణ సినిమాలో ఓ సీను గుర్తొచ్చింది…. రమేష్ అరవింద్ కి, జెమినీ గణేశన్ కూతురికి పెళ్ళి జరుగుతున్నప్పుడు పాత కోపాన్ని దృష్టిలో పెట్టుకుని అరవింద్ “బిలహరి” గణపతి శాస్త్రి గా ప్రసిద్ధి చెందిన గణపతి శాస్త్రి పాత్ర వేసిన గణేశన్ ని - ఆ బిలహరి రాగాన్ని కట్నంగా ఇవ్వమని అడుగుతాడు. అంటే, ఇంకెప్పుడూ, ఎక్కడా ఆయన ఆ రాగం పాడరాదన్నమాట. తర్వాత చిరంజీవొచ్చి “నీతోనే ఆగేనా ..” అంటూ పాడి ఆయన గౌరవం నిలబెడతాడు అనుకోండి… అది వేరే విషయం.
పై రెండూ చూసాక ఒక సందేహం వచ్చింది. ఈ సినిమా సంఘటన ఆ నిజ జీవితపు సంఘటన నుండి స్పూర్తి పొందిందా అని… అంటే…అదేమీ పెద్ద విషయం కాదు కానీ…. త్యాగయ్యకి అలా జరిగింది అన్న విషయం మాత్రం కొత్తగా ఉంది నాకు వినడానికి.
Labels: సాహిత్య దోషాలు
http://vbsowmya.wordpress.com