Monday, July 21, 2008
తప్పక చూడవలసిన నాలుగు మంచి సినిమాలు
గత నెలా రెణ్ణెల్ల లో కొన్ని పనికిమాలినవి, కొన్ని మంచి నుంచి చాలా మంచి సినిమాలు చూడటం జరిగింది. ఆ సినిమాల్ని పరిచయం చేస్తూ ఓ నాలుగు వాక్యాలు చెబుతున్నా అంతే.
Bicycle Thieves: ఇటాలియన్ సినిమా. సత్యజిత్ రే కి సినిమాలు తీయాలి అన్న కోరికను కలిగించిన సినిమా ఇదేనని అప్పుడెప్పుడో వికీ లో చదివిననాటి నుండి దీన్ని చూడాలి అనిపిస్తూ ఉండింది. ఈ సినిమా చూస్తూ ఉంటే ఆ మధ్య “కథా? కథనమా?” అంటూ వార్త లో వచ్చిన వ్యాసం గుర్తు వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో కథ అన్నదానికంటే కథనమే కథను నడిపించింది ఏమో అనిపిస్తుంది నాకు. కథ ఏమిటంటే - ఒకతనికి కొత్త ఉద్యోగం లో సైకిల్ ఉండటం తప్పనిసరి. అలాంటిది కష్టపడి కొనుక్కున్న సైకిల్ కాస్తా మొదటిరోజే దొంగలు దొంగిలిస్తారు. మిగిలిన సినిమా అంతా ఆ సైకిల్ కోసం అతను, అతని కొడుకూ చేసే ప్రయత్నాలు, వాళ్ళ అనుభవాలు… ఇవే. నేనిలా చెప్పానంటే .. ఏముంది ఈ కథలో? అనొచ్చు విన్నవారు ఎవరైనా. నిజమే… ఏముంది? కానీ, సినిమా చూస్తున్నంత సేపూ నేను ఇంకేమీ పట్టించుకోలేదు. వాస్తవికత ఉట్ట్టిపడుతూ ఉండటం దీని మరో ప్రత్యేకత. సినిమాలో నిరుపేద హీరో, నిజజీవితం లో కూడా ఫ్యాక్టరీ వర్కరే నట. ఈ సినిమా చాలా మంచి సినిమా
Strangers on a train: నాకు ఆ మధ్య చూసిన To catch a thief, Rear Window ల ప్రభావం తో హిచ్‍కాక్ సినిమా అంటే చాలు..చూసేద్దాం అనిపిస్తుంది అలాగే దీన్ని కూడా చూసాను.ఇదొక 1951 హాలీవుడ్ సినిమా. దీని కథ కూడా కాస్త రొటీన్ కి భిన్నం. ట్రెయిన్ లో కలిసిన ఇద్దరి మధ్య సంభాషణ తో మొదలౌతుంది కథ. బ్రూనో తన తోటి ప్రయాణికుడు, టెన్నిస్ ఆటగాడు అయిన గయ్ హేన్స్ తో ఓ ఒప్పందం కుదుర్చుకుందాం అంటాడు. అతనికి అడ్డుగా ఉన్న అతని తండ్రిని గయ్, గయ్ కీ, అతని ప్రియురాలికి అడ్డుగా ఉన్న గయ్ భార్యను బ్రూనో చంపాలి అన్నది ఆ ఒప్పందం సారాంశం. గయ్ ఈ మాటల్ని పెద్దగా పట్టించుకోడు… తరువాత అతని భార్య ని నిజంగానే బ్రూనో చంపేసి అతనికి చెప్పేదాకా. అక్కడి నుండి బ్రూనో గయ్ ని వెంటాడుతూ ఉంటాడు…. మా నాన్న ని ఎప్పుడు చంపుతావు అని. కథ ఇలా సాగి చివరికి గయ్ నిర్దోషిత్వం బయట పడ్డం తో ముగుస్తుంది. అయితే, సినిమా లో బాగా మనల్ని ఆకర్షించేవి రెండు. హిచ్‍కాక్ మార్కు స్క్రీన్‍ప్లే, బ్రూనో నటన. అతని నవ్వు లో నే ఎంత క్రూరత్వం చూపాడంటే, అతని బాడీ లాంగ్వేజ్ లోనే ఎంత విలనీ చూపాడంటే - అతని కోసం ఆ సినిమా మరోసారి చూడవచ్చు. క్లైమాక్స్ సీన్ ఒక్కటి కాస్త నిరాశ కలిగించవచ్చు కానీ, మిగితా అంతా చాలా బాగుంది ఈ సినిమా.
Vertigo: నాకు సంబంధించి ఇది గత రెండు, మూడేళ్ళుగా ఎదురుచూసిన సినిమా. ఓ సారెప్పుడో మా తమ్ముడు ఈ సినిమా చూసి నాకు కథ చెప్పేసాడు. అయినప్పటికీ కూడా నాకు ఈ సినిమా చూడాలి అన్న కోరిక తగ్గలేదు. ఇది మరో విలక్షణమైన కథ. హీరో కి పైన్నుంచి కిందకి చూస్తే కళ్ళు తిరిగే జబ్బు ఉంటుంది. అదే వర్టిగో. ఈ జబ్బు వల్లే సినిమా మొదట్లో హీరో తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా ఇస్తాడు. హీరో ని అతని స్నేహితుడు తన భార్య పై నిఘా కు నియమిస్తాడు వర్తమానం లో. క్రమంగా మన హీరోగారికి ఆవిడపై ప్రేమ ఏర్పడుతుంది. ఆవిడ ఓ సంధర్బం లో ఓ భవనం పైన్నుంచి దూకేస్తుంది. తన వర్టిగో వల్ల హీరో ఆమెను కాపాడలేకపోతాడు. తరువాత కొన్ణాళ్ళకు ఆమె జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ సమయం లో ఆమె లాంటి మరో మనిషి తారసపడుతుంది హీరోకి. ఇక ఆమె వెంటపడ్డం మొదలుపెడతాడు. మిగిలిన కథ నా నోటితో నేను చెప్పేసి “ఎందుకు చెప్పేసావ్?” అని అనిపించుకోను. కావాలంటే ఇక్కడ చూడండి. లేకుంటే…ఉత్తమ మార్గం - ఆ సినిమా చూడండి.
The seven Samurai: అకిరా కురొసావా జాపనీస్ సినిమా. ప్రపంచం లోని కొన్ని ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా దీనికి పేరు. యాభైలలో తీసిన బ్లాక్ అండ్ వైట్ సినిమా. నా అభిమాన నటుడు Toshiro Mifune కూడా ఉన్నాడు :) ఇది ఓ బీద పల్లె కథ. ఆ పల్లె వారు బందిపోట్ల బారి నుండి కాపాడుకోడనికి సమురాయ్ ల సాయం తీసుకోవాలని నిశ్చయించుకుంటారు. సమురాయ్ ల వేట, వాళ్ళకి తిండిపెట్తడం కోసం వీళ్ళ కష్టాలు, వీళ్ళు ఆ దోపిడీ దొంగల్ని ఎదుర్కున్న తీరు, మధ్యలో ఓ లవ్‌స్టోరీ… ఇదీ కథ. ఎటొచ్చీ, What stands out is the screenplay. కురొసావా సినిమాలు పరిచయమయ్యాక ఇప్పటి దాక నచ్చని సినిమా అంటూ ఏదీ తారసపళ్ళేదు ఆయనది. సో, Needless to say, even this was a watchable movie. మరో పాయింట్… తొషీరో మిఫునె నటన. ఇతనో అధ్భుతమైన నటుడు…. ఏ రోలైనా అలవోకగా నటించేస్తాడు…అదే…జీవించేస్తాడు. ఇతనిలా ఇంకోళ్ళు చేయలేరు అంటే బహుశా అతిసయోక్తి కాదేమో…
నిజానికైతే ప్రతి సినిమా గురించీ ఎంతైనా రాసుకుంటూ పోవచ్చు…. ఎటొచ్చీ ఇక్కడ నాకు ప్రస్తుతం 3 సమస్యలు..
1. సమయాభావం.
2. ఏదో మందుల్లేని రోగంతో దాదాపు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్న నా Internet connection.
3. ఆల్రెడీ చనిపోయి, ప్రస్తుతం ఆత్మ రూపం లో నాకు సేవలందిస్తున్నా నా RAM.
అందువల్ల, ఈ సారికి ఇలా సరిపెట్టేసుకోండి.
Labels: సినిమాలు
http://vbsowmya.wordpress.com