Wednesday, December 10, 2008
గండికోట - రెండు కొండలనూ వరుసుకుంటూ వెళ్తున్న పెన్నా నది ఇవతలి ఒడ్డుపైనుంచీ చూస్తే ఆవలి తీరం దగ్గరగా వున్నట్లే వుంటుంది గానీ ఎంత శక్తిమంతుడైనా ఆవలి ఒడ్డుకు రాయి విసరలేడని ప్రతీతి. కొండలో పెన్న చేసిన
ఆ గండి వల్లనే దానికి “గండి కోట” అని పేరొచ్చిందట,క్లుప్తంగా గండికోట గురించి ఇక విషయానికొస్తే ...
గండికోట మన రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం . ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణికి గండికోట కొండలని పేరు . ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు స్పష్టమవుతున్నది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. ఇక్కడి లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శతృవుదాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచమేర్పడింది.
తెలుగు వారి శౌర్య ప్రతాపాలకు, దేశాభిమానానికి, హిందూధర్మ సంరక్షణాతత్పరతకు ప్రతీక గండికోట. విజయనగర సామ్రాజ్యానికి వెన్నెముకగా నిలచి, విజయనగర రాజులకు విశ్వాసపాత్రులై, పలు యుద్ధములలో తురుష్కులను ఓడించి, ప్రసిద్ధి గాంచిన పెమ్మసాని నాయకులకు నెలవు గండికోట.ఒకానొకప్పుడు దుర్భేధ్యమైన ఈ రేచర్ల నాయకుల కోట ఇప్పుడు శిధిలావస్థలో ఉన్నది. ఇది ఒక ముఖ్య చూడదగిన పురాతన ప్రదేశము.

కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలున్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. అప్పటి శిధిల శిల్పాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. 

జామా మసీదు
మీర్ జుమ్లా జామా మసీదును సుందరంగా నిర్మించాడు. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మీనార్లు ముఖ్యమైన కట్టడాలు. ఇంతే గాక జైలు, రంగ్ మహల్ ఉన్నాయి. నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు, ఇంకా చాలా చెరువులు, బావులున్నాయి. భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరచిన నీటి సదుపాయం ఇక్కడి ప్రత్యేకత.
ఇక్కడ ఉన్న ఓ కోనేటిలో నీరు ఎర్రగా వుంటాయి ఎందుకంటే ,పూర్వం యుద్ధం ముగిసిన తరువాత ఆ కత్తులన్ని ఇక్కడి కోనేతిలోనే కడిగే వారట ,అందుకే అందులో వున్న నీళ్ళకి ఆ ఎరుపురంగుంటుంది అని అంటారు ,గమ్మత్తైన విషయమేమిటంటే ఇప్పుడు రాజులు లేరు రాజ్యాలు లేవు కాని ఆ కోనేటి నీరు అలానే ఎర్రగానే వున్నాయి .
గతంలో ఈ కోటలో సుందరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు ఉండేవి. పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి.
చరిత్ర
గండికోట భారత దీపకల్పములోని ఒక ప్రముఖమైన గిరిదుర్గము, దీని చరిత్ర 13వ శతాబ్దము యొక్క రెండవ అర్థభాగములో మొదలవుతుంది. గండికోట కైఫియత్ లో పశ్చిమ కళ్యాణీ చాళుక్య రాజైన ఆహవమల్ల సోమేశ్వర I చే
మలికినాడు సీమకు సంరక్షకునిగా నియమించబడిన కాకరాజు శా.1044 శుభకృతు నామ సంవత్సర మాఘ శుద్ధ దశమి (1123 జనవరి 9) నాడు ఈ కోటను కట్టించెను అని పేర్కొనబడింది. ఐతే ఇదినిజమని నిర్ధారించడానికి మరే ఇతర చారిత్రక ఆధారాలూ లేవు. త్రిపురాంతకము వద్ద గల శా.1212 (1290) నాటి ఒక శాసనం ప్రకారం, అంబదేవ అనే ఒక కాయస్త నాయకుడు, తన రాజధానిని వల్లూరు నుంచి గండికోట కు మార్చాడని భావిస్తున్నారు. ఉప్పరపల్లె దగ్గర గల శా.1236కు చెందిన ఒక శాసనం ప్రకారం ప్రతాపరుద్రుని సామంతుడు ఒకరు ఈ కోటను జయించాడని, ప్రతాపరుద్రుడు జుట్టయలెంక గొంక రెడ్డిని గండికోటని పాలించడానికి నియమించాడని తెలుస్తోంది.

గండికోట
విజయనగర సామ్రాజ్య కాలములో ఉదయగిరి మండలము (ప్రాంతము)లోని ఒక సీమకు రాజధానిగా ఉండేది. 16వ శతాబ్దపు రెండవ అర్ధభాగములో గండికోటను పెమ్మసాని నాయకులు తిమ్మానాయుడు, రామలింగనాయుడు విజయనగర రాజుల సామంతులుగా పాలించారు.[1] విజయనగర సామ్రాజ్యము విచ్ఛిన్నమైనపుడు, పదిహేడవ శతాబ్దం మధ్య ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా కుమార తిమ్మానాయునికి మంత్రి పొదిలి లింగన్న ద్వారా విష ప్రయోగము చేయించి ఈ కోటను స్వాధీన పరచుకొన్నాడు.
మీర్ జుంలా గండికోటలోని మాధవస్వామి ఆలయము ధ్వంసం చేసి పెద్ద మసీదు నిర్మించాడు. దేవాలయానికి చెందిన వందలాది గోవులను చంపించాడు.కోటను ఫిరంగుల తయారీకి స్థావరము చేస్తాడు.గండికోటపై సాధించిన విజయముతో మీర్ జుంలా మచిలీపట్నం నుండి శాంథోం (చెన్నపట్టణము) వరకు అధికారి అయ్యాడు.ఈ సమయములోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాల వర్తకుడు టావర్నియెర్ గండికోట సందర్శించాడు.
ఎలా చేరుకోవాలంటే ...
గండికోట జమ్మలమడుగు నుంచి పడమరగా దాదాపు ఆరు మైళ్ళ దూరంలో ఒక పర్వత శ్రేణిపై ఉన్నది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి. జమ్మలమడుగు నుంచి బస్సు సౌకర్యం కలదు .
రంగనాథాలయం: ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన శా.1479 (క్రీ.శ.1577) నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఆ శాసనం గండికోట లోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఈ ఆలయనిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథాలయం నూటికి నూరు పాళ్ళూ విజయనగర రాజుల నిర్మాణం అని స్పష్టమౌతుంది. ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని క్రీ.శ.పదహైదవ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పవచ్చు.
మాధవరాయ ఆలయం ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన క్రీ.శ.పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది. ఆలయంలో మనకు కనిపించే శిల్ప కళా లక్షణాలు, ఆలయనిర్మాణశైలిని బట్టి చూసినా ఆలయ నిర్మాణం అదే కాలంలో జరిగినట్లు తోస్తుంది. ఆలయనిర్మాణాన్నీ, అందలి శిల్పకళారీతుల్నీ, వాటి లక్షణాలనూ విశదంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆలయాన్ని క్రీ.శ.పదహారవ శతాబ్దం తొలినాళ్ళలో(దాదాపుగా 1501-1525 మధ్యకాలంలో) నిర్మించినట్లు చెప్పవచ్చు

సిని ప్రస్థానంలో గండికోట
ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు సంపాదకుడు, సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు.హేతువాది అయిన గూడవల్లి రామబ్రహ్మం 1934 లో ఆంధ్ర నాటక పరిషత్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆయన కమ్మ కుల చరిత్ర అనే పుస్తకం వ్రాశాడు. ఆ పుస్తకం వ్రాయడం కోసం కమ్మ కులం గురించి అవసరమైన సమాచారం సేకరించడానికి కడపకు వెళ్ళాడు. అక్కడ ఆయన గండికోట పట్ల ఆకర్షితుడై ఆ కోట గురించి పరిశోధన చేసి 'గండికోట పతనం' అనే నాటకం వ్రాశాడు. ఈ నాటకం అనేక నగరాల్లో ప్రదర్శించబడి మంచి ప్రజాదరణ పొందింది.
గండికోట గురించిన పూర్తి చరిత్రతో మరో టపా లో కలుసుకుందాం అంతవరకు సెలవు
గండికోట గురించిన పూర్తి చరిత్రతో మరో టపా లో కలుసుకుందాం అంతవరకు సెలవు
THANK యు FOR VISITING ARADHANA

Labels: చరిత్ర
2 Comments:
Subscribe to:
Post Comments (Atom)
చాలా కష్టపడి పరిశోధించి మరీ వ్రాసినట్టున్నారు.
అభినందనలు.